Dead Body Eyes Missing In UP : శవపరీక్షల కోసం ఆస్పత్రిలో ఉంచిన మృతదేహం కళ్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న ఓ యువతి కళ్లు మాయం కావడం ఆస్పత్రిలో చర్చనీయాంశమైంది.
ఇదీ జరిగింది
సొనాహ్ ప్రాంతంలోని శంకర్పుర్కు చెందిన 17ఏళ్ల శశికళ గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడే చికిత్స పొందుతూ మరణించింది. దీంతో మృతదేహాన్ని శవపరీక్షల కోసం అక్కడే ఉంచారు. అయితే రాత్రి అయిపోవడం వల్ల శుక్రవారం శవపరీక్షలు చేస్తామని చెప్పారు వైద్యులు. ఈ క్రమంలోనే శుక్రవారం మార్చురీకి వెళ్లారు తల్లిదండ్రులు. పరీక్షల కోసం శశికళ మృతదేహాన్ని బయటకు తీయగా, ఆమె కళ్ల నుంచి రక్తం రావడాన్ని గమనించారు. వెంటనే తల్లిదండ్రులు పరీక్షించగా, ఆమె రెండు కళ్లు కనిపించలేదు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తమ కూతురు కళ్లు మాయమయ్యాంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. మరికొందరు కళ్లను ఎలుకలు కొరికేశాయంటూ ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన ఆస్పత్రిలో చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఆస్పత్రి డిప్యూటి సీఎంఓ, ఆమె కళ్లు పోలేదని వివరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వైద్య బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు అధికారులు. మృతదేహాన్ని పరీక్షించిన వైద్య బృందం కళ్లు పోలేదని తేల్చిచెప్పారు. మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టడం వల్ల కంటి లోపల ఉండే విట్రస్ హ్యూమర్ అనే ద్రవం బయటకు వచ్చి కళ్లు కనిపించకుండా పోయాయని తెలిపారు.
మార్చురీలో కుళ్లిపోయిన మృతదేహం!
Negligence Mortuary Staff Body Decomposes : అంతకుముందు కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల మార్చురీలోనే మృతదేహం కుళ్లిపోయింది. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు దక్షిణ కన్నడ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కమిషన్, మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. సకాలంలో పరిహారం చెల్లించకుంటే ఈ మొత్తానికి అదనంగా 8 శాతం వడ్డీ కలిపి ఇవ్వాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది.