Cow At Owner Funeral : మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ ఆవు మూగవేదన అందరికీ కన్నీళ్లు తెప్పించింది! తనకు సేవ చేసినవ్యక్తి హఠాత్తుగా మరణించడం వల్ల అతడి మృతదేహం వద్ద ఏడుస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ తర్వాత అతడి అంత్యక్రియలు జరిగే వరకు శ్మశాన వాటికలోనే ఉంది. అనంతరం బంధువులతో తిరిగి వచ్చింది.
దినచర్యలో మొదటి ప్రాధాన్యం గోసేవకే!
జిల్లాలోని ఖిమ్లాసాకు చెందిన మహీప్ సింగ్ యాదవ్కు ఆవులు అంటే ఎంతో ఇష్టం. మూగ జంతువులపై మహీప్ సింగ్కు ఉన్న ప్రేమ ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. తన చివరి క్షణాల వరకు ఆవులకు సేవ చేస్తూ ప్రేమగా చూసుకున్నాడు. మహీప్ సింగ్ దినచర్యలో మొదటి ప్రాధాన్యం గోసేవకు ఉండేది. అయితే మహీప్ ఓ ఆవును తన కన్నబిడ్డలా చూసుకునేవాడు. ఆ ఆవును విడిచి మహీప్ ఎక్కడికీ వెళ్లేవాడు కాదు.
మహీప్ సింగ్ శుక్రవారం మరణించాడు. అతడి అంత్యక్రియలకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులంతా చేరుకున్నారు. ఆ సమయంలో మహీప్ సేవ చేసిన ఆవు కూడా అక్కడికి చేరుకుంది. దీంతా ఆ ఆవును తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆవు కదల్లేదు. మహీప్ సింగ్ యాదవ్ మరణంతో ఆవు బాధపడుతుందని గ్రామస్థులు అర్థం చేసుకున్నారు. ఆవు కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయని, అక్కడి నుంచి కదల్లడానికి సిద్ధంగా లేదని తెలుసుకున్నారు. అంతిమయాత్ర మొదలైన తర్వాత దానంతట అదే వెళ్లిపోతుందని అనుకున్నారు.
మృతదేహానికి ఆవు ప్రదక్షిణలు!
అయితే మహీప్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా ఆ ఆవు కూడా కుటుంబసభ్యులు, గ్రామస్థులతో అక్కడికి చేరుకుంది. శ్మశాన వాటికలో మహీప్ అంత్యక్రియలు కొనసాగుతుండగా ఆవు అక్కడే ఉంది. దహన సంస్కారాల సమయంలో మృతదేహం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆవుకు తన సేవకుడి పట్ల ఉన్న ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఆవును చిన్నప్పటి నుంచి మహీప్ సింగ్ కన్నబిడ్డలా చూసుకున్నాడని, అందుకే అది అంతగా వేదనకు గురైందని స్థానికులు చెబుతున్నారు.