Haryana Elections 2024 Congress : హరియాణా శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను ప్రకటించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. క్రిమీలేయర్‌ను ప్రస్తుతమున్న రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని తెలిపింది. సాత్ వాదే పక్కే ఇరాదే పేరుతో ఏడు గ్యారంటీలను దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా విడుదల చేశారు.
18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు నెలకు 2 వేల రూపాయలతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఇల్లు లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 100 చదరపు గజాల స్థలం, నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు ఇస్తామని తెలిపింది. అయితే తాము హామీలను తప్పక అమలు చేస్తామని ఖర్గే తెలిపారు. అందుకే సాత్ వాదే పక్కే ఇరాదే అని పేరు పెట్టామని చెప్పారు.
#WATCH | Haryana Congress chief Udai Bhan says, 'Congress government in Haryana will provide Rs 2000 per month to every woman above 18 years to empower them. LPG gas cylinders in Rs 500. Rs 6,000 pension to senior citizens. Old Pension scheme will be restored. 2 lakh vacant… https://t.co/UXlsOMsZTy pic.twitter.com/RRdyYnuxI7
— ANI (@ANI) September 18, 2024
మరోవైపు, 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీకి కాంగ్రెస్ 89 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానాన్ని మాత్రం సీపీఎంకు వదిలిపెట్టింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రముఖ నేతల వారసులకు టికెట్లు ఇచ్చింది. పార్టీ ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జేవాలాను ఖైతాల్ నుంచి పోటీలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ మనవడు అనిరుధ్ చౌధరీ, తొషమ్ నుంచి పోటీ చేయనున్నారు.
రేవారీ ఎమ్మెల్యే చిరంజీవ్ రావుకు మరోసారి టికెట్ దక్కింది. ఆయన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అజయ్ సింగ్ యాదవ్ కుమారుడు. మాజీ కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌కు ఉచానాకలాన్ నుంచి టికెట్ ఇచ్చింది. ఆ స్థానంలో హరియాణా మాజీ ఉపముఖ్యమంత్రి, జేజేపీ చీఫ్, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలాతో పోటీ పడనున్నారు. పంచకుల నుంచి మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ పెద్ద కుమారుడు చందర్ మోహన్, కలాయత్ నుంచి హిస్సార్ ఎంపీ జైప్రకాశ్ తనయుడు వికాస్ బరిలో ఉన్నారు. ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ జులానా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.