భరతమాత ముద్దుబిడ్డ, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు సాయంత్రం ముంబయిలో జరగనున్నాయి. ప్రస్తుతం NCPA మైదానంలో ఉన్న ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు అనేక మంది ప్రముఖులు, సామాన్యులు తరలివస్తున్నారు. సాయంత్రం వరకు పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
బుధవారం రాత్రి ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన రతన్ టాటా భౌతిక కాయాన్ని తొలుత దక్షిణ ముంబయిలోని కోలాబాలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు ప్రమఖులు, టాటా గ్రూప్ ఉన్నతాధికారులు వెళ్లి నివాళులు అర్పించారు. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత రతన్ టాటా పార్థివదేహాన్ని ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. ప్రత్యేకంగా బ్యాండు, కవాతుతో పోలీసులు ఆయన్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం వరకూ NCPA గ్రౌండ్‌లోనే రతన్ టాటా భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. ఈ క్రమంలో NCPA గ్రౌండ్‌కు దారితీసే మెరైన్ డ్రైవ్ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. అంతేకాకుండా ఆ దారిలో భద్రతా బలగాలను మోహరించారు.
#WATCH | Maharashtra | People pay last respect to Ratan Tata, at NCPA lawns, in Mumbai
— ANI (@ANI) October 10, 2024
The last rites will be held at Worli crematorium after 4 pm, today pic.twitter.com/S1YIYH9Xif
మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో NCPA గ్రౌండ్ నుంచి రతన్ టాటా అంతిమయాత్ర జరగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రతన్ టాటా మృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను కూడా అవనతం చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్లినందున భారత ప్రభుత్వం తరపున రతన్ టాటా అంత్యక్రియాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే నోయెల్ టాటాకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ, రతన్ టాటా మృతిపై విచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా టాటా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
NCP గ్రౌండ్స్‌లో ప్రముఖుల నివాళులు
రతన్ టాటా పార్థివదేహానికి ఎన్సీపీ-ఎస్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా నివాళులు అర్పించారు. వీరితో పాటు దిగ్గజానికి నివాళులర్పించేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు.
#WATCH | Maharashtra deputy CM Ajit Pawar and NCP working president Praful Patel pay last respect to Ratan Tata, at NCPA lawns, in Mumbai pic.twitter.com/UMhUB3Zqdh
— ANI (@ANI) October 10, 2024
#WATCH | Mumbai | Aditya Birla group chairman Kumar Mangalam Birla at NCPA grounds to pay last respects to veteran industrialist Ratan Tata pic.twitter.com/oBJn7lVVY9
— ANI (@ANI) October 10, 2024
'ఆయన సహనశీలురు'
రతన్ టాటా మృతి పట్ల రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌జీ మరణం తీరని లోటని ఆమె విచారం వ్యక్తం చేశారు. "రతన్ టాటా సహనశీలురు. ఇతరుల పట్ల ఎంతో శ్రద్ధ, కరుణ చూపిస్తారు. అలాంటి మరో వ్యక్తి నాకు తారసపడలేదు" అని కొనియాడారు.
'ఆ అల్పాహారాన్ని ఎంతో మెచ్చుకున్నారు'
రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఆయనకు గడిపిన ఓ మధుర స్మృతిని మీడియాకు తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
"ముంబయిలోని మా నివాసానికి ఆయన్ను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించాం. ఆ రోజు మేము ఇడ్లీ, సాంబార్, దోశ మాత్రమే వడ్డించాము. అది చాలా సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆ ఆహారాన్ని ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ఆయన ఇంట్లో ప్రపంచంలోని అత్యుత్తమ కుక్‌లు చేసిన వంటకాలను రుచి చూసుంటారు. కానీ ఆయన ఆ సాధారణ అల్పాహారాన్ని కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. భోజనం వడ్డించిన సర్వర్‌తో కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అయితే ఆయన ఇంటికి వెళ్లేముందు, నా భార్యతో "మీరు నాతో ఓ ఫోటో దిగాలనుకుంటున్నారా" అని ఆయన అడిగారు. మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. మేమే ఆయన్ను అడగాలనుకున్నాం కానీ సంకోచంగా ఆగిపోయాం. ఇటువంటి చిన్న విషయాలే ఆయన్ను 140 కోట్ల మంది భారతీయలు ప్రేమించేలా చేసింది" అని పీయూష్ గోయల్ టాటాను ప్రశంసించారు.
చిన్నకార్లతో మిడిల్ క్లాస్ కల సాకారం- ఆటోమొబైల్ ఇండస్ట్రీపై టాటా మార్క్
రతన్ టాటా గ్రేట్ లవ్ స్టోరీ - ఆమెపై ప్రేమతో జీవితాంతం బ్రహ్మచారిగా!