Kerala High Court On Hema Committee Report : కేరళలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ గత కొన్ని రోజులుగా మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. పలువురు సినీతారలు చిత్ర పరిశ్రమలో వారు ఎదుర్కొన్న పరిస్థితులను హేమ కమిటీ ద్వారా బయటకు వెళ్లగక్కుతున్నారు. ఈ తరుణంలో కేరళ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఆందోళనకు గురిచేస్తోందని హైకోర్టు వెల్లడించింది. కమిటీ వేసి, నాలుగేళ్లు ఖాళీగా కూర్చున్నారా అంటూ కోర్టు మండిపడింది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. సినీతారల వేధింపుల వ్యవహారం చిన్న విషయం కాదని, సిట్ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేరళ హై కోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు అంశంపై కేరళ సీఎం పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరే సినీ పరిశ్రమలోనూ హేమ కమిటీ లాంటివి వేయలేదని, ఒక్క కేరళలో వామపక్ష ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చినవారు, ఇవ్వని వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, వాటిని క్షుణ్నంగా పరిశీలిస్తారని విజయన్ అన్నారు. కేరళ ప్రభుత్వం మహిళల భద్రతకు భరోసా ఇచ్చేలా కచ్చితమైన విధానాలతో ముందుకెళ్తోందని చెప్పారు. సినీ పరిశ్రమలో పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పునరుద్ఘటించారు. మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిళలపై దాడులు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే?
2017లో కొచ్చిలో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది. రౌడీలతో ఆమెపై లైంగిక వేధింపులు జరిపినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో అతడు అరెస్టు అయ్యాడు. ఈ నేపథ్యంలో మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. ఇటీవల ఈ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై పలు దిగ్భ్రాంతికర విషయాలను నివేదికలో పేర్కొంది.
హేమ కమిటీ రిపోర్ట్ ఎఫెక్ట్ - ప్రముఖ యాక్టర్‌పై రేప్ కేసు నమోదు - Hema Committee Report
మాలీవుడ్‌ను నాశనం చేయొద్దు- వారికి శిక్ష తప్పదు: మోహన్ లాల్ - Mohanlal