CM Mass Marriage Scheme Fraud : పెళ్లికొడుకు లేకుండానే వందలాది యువతులు పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగింది. తమ మెడలో తామె వరమాలలు (పూలదండలు) వేసుకొని వివాహం చేసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక'లో ఈ దృశ్యం కనిపించింది. మరి వీరంతా ఇలా ఎందుకోసం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
రూ.51,000 కోసం నకిలీ పెళ్లిళ్లు!
పేదింటి పిల్లల పెళ్లి కోసం 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక' పథకాన్ని ప్రారంభించింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఈ పథకం కింద నిరుపేద కుటుంబానికి చెందిన యువతీయువకులకు ఆర్థిక సాయం కింద రూ.51,000ను అందజేస్తోంది. అయితే దీని ద్వారా లబ్ధి పొందాలనే దురాలోచనతో కొందరు అధికారులు, దళారులతో చేతులు కలిపారు. ఇందులో భాగంగా ఈనెల 25న మణియార్ ఇంటర్ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లి కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. ఇందుకోసం కొందరు పెళ్లికాని, అప్పటికే కొత్తగా పెళ్లైన యువతీయువకులకు డబ్బు ఎర చూపి తీసుకువచ్చారు. ఒప్పందం ప్రకారం వీరంతా నకిలీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. దీని ప్రకారం తమతమ మెడల్లో పూలదండలు వేసుకొని పెళ్లి చేసుకున్నారు.
'అవును డబ్బు కోసమే చేశా'
ఇక ఇదే విషయమై ఓ యువకుడిని మీడియా ప్రశ్నించగా- 'కొందరు దళారులు నాలాంటి యువకులకు డబ్బు ఆశ చూపి నకిలీ పెళ్లికొడుకుగా మార్చారు. ఈ వివాహ వేడుకలో కొందరు వధువులు వారి మెడలో వారే వరమాలలు వేసుకున్నారు. నాకు జంటగా కూర్చున్న యువతి కూడా అలానే చేసింది. నేనూ నా మెడలో పూలదండ వేసుకున్నాను. వధువుకు సింధూరం కూడా పెట్టలేదు' అని నకిలీ వరుడు తెలిపాడు.
బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు!
ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో స్పందించిన జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి దీపక్ శ్రీవాస్తవ ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక పథకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అభివృద్ధి సహాయ అధికారి సునీల్ కుమార్ యాదవ్‌తో పాటు 8మంది నకిలీ లబ్ధిదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో అర్చన, రంజనా యాదవ్, సుమన్ చౌహాన్, ప్రియాంక, సోనమ్, పూజ, సంజు, రమిత అనే వ్యక్తులను నిందితులుగా చేర్చినట్లు మనియార్ ఎస్‌హెచ్‌ఓ మంతోశ్ సింగ్ బుధవారం వెల్లడించారు. అయితే సునీల్ కుమార్ అనే అధికారి దరఖాస్తులను పరిశీలించడంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆయనపైనా కేసు నమోదు చేశామని చెప్పారు. ఇక ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.
'ఇంకా నగదు విడుదల చేయలేదు'
మనియార్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో జరిగిన సామూహిక వివాహాల వేడుకలో పాల్గొన్న లబ్ధిదారులెవ్వరికీ ఇంకా నిధులను విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. 'ప్రస్తుతానికి అభివృద్ధి సహాయ అధికారితో పాటు విచారణలో తేలిన 8మందిపై కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేప్టటి చర్యలు తీసుకుంటాము' అని ఆయన చెప్పారు. ఇక ఇదే అంశంపై మంగళవారం (జనవరి29న) చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఈ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పైన పేర్కొన్న 8మంది లబ్ధిదారులకు ఇదివరకే విడివిడిగా వివాహాలు జరిగినట్లు తేలింది. వీరంతా తమకు పెళ్లి జరిగిన విషయాలను దాచిపెట్టి పథకానికి దరఖాస్తు చేసుకున్నారని వెల్లడైంది.
బీజేపీని బలోపేతం చేసేందుకే సీపీఐతో కాంగ్రెస్ దోస్తీ : మమత
రాహుల్ గాంధీ కారుపై రాళ్లదాడి! కాంగ్రెస్ భిన్న ప్రకటనలు- ఏం జరిగింది?