Man Fell Into Borewell In Delhi : దిల్లీ జల్‌బోర్డుకు చెందిన నీటి శుద్ధి కేంద్రంలోని బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తిని కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి బాధితుడిని బయటకు తీశాయి.
అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు. బోరుబావిలో పడిపోయిన వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీశాయని మంత్రి ఆతిషి తెలిపారు. బావిలో మృతుడు ఎలా పడిపోయాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆతిషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అంతకుముందు బోరుబావిలో వ్యక్తి పడిపోవడం దురదృష్టకరమని మంత్రి ఆతిషి దిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తును ఆదేశించారు. సకాలంలో విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగించని అన్ని బోరుబావులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తనకు నివేదిక సమర్పించాలని తెలిపారు.
ఇదీ జరిగింది
పశ్చిమ దిల్లీలోని కేశోపుర్ మండిలో 40 అడుగుల బోరుబావిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే బోరుబావిలో పడింది చిన్నారి అని మొదట అంతా అనుకున్నారు. కానీ ఓ వ్యక్తి బావిలో పడ్డారని అధికారులు నిర్ధరించారు. ఇంకాం మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.
ఈ ఘటనపై తమకు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత సమాచారం అందిందని దిల్లీ ఫైర్ సర్వీసెన్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్నామని, ఆ తర్వాత సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ బృందం బోర్వెల్కు సమాంతరంగా గొయ్యిని తవ్విందని అని అతుల్ గార్గ్ వెల్లడించారు.
బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలిక మృతి- ప్రమాదం నుంచి రక్షించినా దక్కని ప్రాణాలు
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 72ఏళ్ల పద్మశ్రీ గ్రహీతకు 'సర్కార్' వారి ఇల్లు- త్వరలోనే గృహప్రవేశం!