Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్ రీవా జిల్లాలోని మనికా గ్రామంలో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాలుడు 40 అడుగుల లోతులో ఉన్నట్లు ఎస్డీఈఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. కాగా, చిన్నారి పడ్డ బావి 70 అడుగుల లోతు ఉన్నట్లు తెలుస్తోంది.
బాలుడికి పైపుల సాయంతో ఆక్సిజన్ అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమరాను లోపలికి పంపించేందుకు యత్నించినప్పటికీ మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. వీలైనంత త్వరగా చిన్నారిని రక్షించేందుకు జేసీబీల సాయంతో బోరుబావి చుట్టూ సొరంగం తవ్వుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మనికా గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుూ వెళ్లి ఓ బాలుడు బోరు బావిలో పడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల సహాయక చర్యలు చేపట్టారు.
'సమాతరంగా సొరంగం తవ్వుతున్నాం'
'బోరుబావిలో పడిపోయిన చిన్నారిని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. బాలుడు పడ్డ బోరుబావి లోతు 70 అడుగులు వరకు ఉంటుంది. 50 అడుగులు తవ్విన తర్వాత చిన్నారి 45-50 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బాధిత బాలుడిని చేరుకునేందుకు వీలుగా ఉండేలా సమాంతరంగా సొరంగాన్ని తవ్వుతున్నాం. వైద్యుల బృందం కూడా ఘటనాస్థలి వద్ద ఉంది' అని రీవా జిల్లా కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపారు.
"జానేహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానికా గ్రామంలో మయూర్ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న బోరుబావిలో పడ్డాడు. కొందరు పిల్లలతో కలిసి అతడు శుక్రవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు సమీపంలోని పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 70 అడుగులు లోతుగల బోర్‌బావిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు మాకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ ఇన్‌ఛార్జి, ఎస్‌డీఎం, అధికారులతో పాటు పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి."
- అనిల్ సోంకర్, అడిషనల్ ఎస్పీ
సీఎం స్పందన
చిన్నారి బోరుబావిలో పడ్డ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లాను ఆదేశించారు. తాను కూడా సంబంధిత అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని చెప్పారు.
'బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించేందుకు ఇరువైపులా 35 అడుగులు సొరంగం తవ్వారు. వీటి ద్వారా అతడిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం వారణాసి నుంచి ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ దళాన్ని రప్పించాం. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాలు రెస్క్యూ ఆపరేషన్‌కు విఘాతం కలిగిస్తున్నాయి' అని ముఖ్యమంత్రి తెలిపారు.