Bomb Threat To Delhi North Block : దేశ రాజధాని దిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని దిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు ఈమెయిల్‌ను దుండగులు పంపించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు.
నార్త్ బ్లాక్ నుంచి ఉద్యోగులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా భద్రతా బలగాలు సూచించాయి. వెంటనే హోం శాఖ కార్యాలయం పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నాయి. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. విజయ్ చౌక్, నార్త్ అవెన్యూ మార్గాల్లో అగ్నిమాపక యంత్రాలను దిల్లీ పోలీసులు సిద్ధం చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదని తెలిపారు.
'ద్వారకకు ఎలాంటి బెదిరింపులు రాలేదు'
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ద్వారకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అయితే ఆ ప్రాంతానికి ఎలాంటి బాంబు బెదిరింపులు రాలేదని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న వాణిజ్య సముదాయంలోని ఓ దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం మాత్రమే జరిగిందని వెల్లడించారు.
ఇది ఐదోసారి!
నెల రోజుల వ్యవధిలో దిల్లీకి ఇలా బెదిరింపు మెయిల్స్ రావడం ఇది ఐదో సారి. వరుస బెదిరింపులు రావడం వల్ల నగర వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల తిహాడ్ జైలుకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో జైలు అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. బాంబు స్వ్కాడ్ సిబ్బంది కీలక నేతలు సహా ముఖ్యమైన ఖైదీలు ఉన్నచోట్ల సోదాలు చేపట్టినట్లు సమాచారం.
అంతకుముందు నగరంలోని 20 ఆస్పత్రులు సహా ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 150కి పైగా పాఠశాలలకు కూడా వచ్చాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పాఠశాలలన్నింటికీ ఒకే ఐపీ అడ్రస్ నుంచి మెయిల్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.