Birthday Party Of VIP Dog : తాను పెంచుకుంటున్న శునకం జన్మదిన వేడుకలను ఓ విలాసవంతమైన హోటల్లో జరిపించారు మధ్యప్రదేశ్ ఇందౌర్‌కు చెందిన ఓ వ్యక్తి. ఈ బర్త్‌డే పార్టీకి చీఫ్ గెస్ట్లుగా మరో 30కిపైగా శునకాలు కూడా రావడం విశేషం. పార్టీకి అతిథిలుగా వచ్చిన కుక్కలకు స్పెషల్ రిటర్న్ గిఫ్ట్స్‌తో పాటు రుచికరమైన డాగ్ మీల్స్‌ను కూడా పంచిపెట్టారు శునకం యజమాని. అలాగే బర్త్‌డే డాగ్‌కు కూడా ప్రత్యేకంగా కానుకలు ప్రెజెంట్ చేశారు ఇతర శునకాల యజమానులు.
పార్లర్‌కు 'హ్యాండ్సమ్' కుక్క
ఇందౌర్ సిటీలోని డైనర్స్ పార్క్‌లో ఈ విందును ఏర్పాటు చేశారు శునకం యజమాని ఆకాంక్ష రాయ్. మూడేళ్ల వయసున్న తన కుక్కను 'హ్యాండ్సమ్' అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటారు ఈమె, వీరి కుటుంబీకులు. గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్‌కు చెందిన తమ కుక్క పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు యజమాని. అనంతరం దానిని ఇందౌర్‌లోని ప్రసిద్ధ ఖజ్రానా గణేశ్ ఆలయానికి తీసుకెళ్లి అర్చన చేయించారు. ఆ తర్వాత తమ హ్యాండ్సమ్ శునకాన్ని డాగ్ పార్లర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ దానికి గ్రూమింగ్ సహా వివిధ రకాల స్నానాలు చేయించి ప్రత్యేకమైన డ్రెస్‌ను తొడిగి అలంకరించారు. అనంతరం హోటల్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ కేక్‌ను హ్యాండ్సమ్ డాగ్‌తో కట్ చేయించారు.
కేక్ కటింగ్ తర్వాత గెస్ట్లుగా వచ్చిన ఇతర శునకాలతో పాటు వాటి యజమానులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా శునకాల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ గేమ్స్ అండ్ మ్యూజిక్ సెషన్లో కుక్కలు పాల్గొన్నాయి. వివిధ బర్త్‌డే సాంగ్స్‌కు సరదాగా స్టెప్పులు వేశాయి. రంగురంగుల బంతులతో కాసేపు పార్క్‌లో కలియతిరిగాయి.
VIP కుక్కకు సోషల్ మీడియా అకౌంట్
'హ్యాండ్సమ్' కుక్క పేరు మీద ప్రత్యేకంగా ఓ సోషల్ మీడియా ఖాతాను కూడా తెరిచారు దాని యజమానులు. కుక్కకు సంబంధించి విషయాలన్నింటినీ ఇందులో పోస్ట్ చేస్తుంటారు. ఈ అకౌంట్‌కు చాలామంది ఫాలోవర్సే ఉన్నారు. ఇక నగరంలో ఎంతో విలాసవంతమైన హోటల్లో ఓ కుక్క పుట్టిన రోజు వేడుకలను ఇంత గ్రాండ్‌గా జరపడం వల్ల ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.
"హ్యాండ్సమ్ను నా బిడ్డలా భావిస్తాను. నేను ఎక్కడికి వెళ్లినా దానిని వెంట తీసుకెళ్తాను. ఇటీవలే అది నాతో కలిసి మనాలీ ట్రిప్‌కు వచ్చింది. 14 గంటలపాటు నాతో కలిసి ప్రయాణించింది. అంతేకాదు మా కుటుంబానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా హ్యాండ్సమ్ పాల్గొంటుంది."
- ఆకాంక్ష రాయ్, డాగ్ బర్త్‌డే పార్టీ నిర్వాహకురాలు
PHD చేసిన 89 ఏళ్ల వృద్ధుడు- తొలి సీనియర్ గ్రాడ్యుయేట్‌గా రికార్డు!
మహిళా కాటికాపరి- 14 ఏళ్లలో 40వేలకుపైగా మృతదేహాలు దహనం- ఎక్కడో తెలుసా?