Bihar Floor Test Result Live : బిహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నీతీశ్ కుమార్ సర్కార్ విజయం సాధించింది. మెజార్టీ మార్కు 122 కాగా, ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో విశ్వాస పరీక్షలో బిహార్ ప్రభుత్వం నెగ్గింది. ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం నీతీశ్‌కు మద్దతుగా ఓటేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు శాసనసభలో సీఎం నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఉపసభాపతి మహేశ్వర్ హజారీ ఓటింగ్‌ను చేపట్టారు. ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
సోమవారం ఉదయం బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో నీతీశ్ సర్కార్ ప్రధాన ప్రాధాన్యం చట్టబద్ధత అని గవర్నర్ తెలిపారు. శాంత్రిభద్రతలు మెరుగుపరచడానికి పోలీసుల సంఖ్య పెంచామని చెప్పారు. అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ చౌధరీని తొలగించేందుకు చర్యలు చేపట్టింది అధికార కూటమి. స్పీకర్‌పై బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 వచ్చాయి. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి సభ ఆమోదం తెలపడం వల్ల ఉపసభాపతి చర్చను చేపట్టారు.
'నీతీశ్‌ను తండ్రిలాగే భావించా'
ఆ సమయంలో ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్డీఏ పక్షం వైపు కూర్చోవడంపై మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తగా, డిప్యూటీ స్పీకర్ హజారీ తిరస్కరించారు. నీతీశ్ కుమార్‌ను తాను ఎప్పుడూ తండ్రిలాగే భావించానని, మహాగఠ్‌బంధన్ నుంచి వైదొలిగి ఎన్డీఏలోకి తిరిగి చేరేందుకు ఆయన్ను ఏ కారణాలు బలవంతం చేశాయో తనకు తెలియదని అన్నారు.
'మోదీ హామీ ఇవ్వగలరా? '
తనలో లాలూ ప్రసాద్ యాదవ్ రక్తం ఉందని తేజస్వీ యాదవ్ అన్నారు. తాము భావజాలాన్ని నమ్మేవాళ్లమని తెలిపారు. తాము కొందరిలా చుట్టూ తిరగమని, ఎవరికీ భయపడమని అన్నారు. దేన్నైనా పోరాడుతామని, పోరాడుతున్నామని చెప్పారు. మహాకూటమి ప్రభుత్వం లేకపోతే నీతీశ్ మళ్లీ సీఎం అయ్యేవారు కాదని అన్నారు. నీతీశ్ కుమార్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడుతామని చెప్పారని, ఇప్పుడు మళ్లీ వాళ్లతోనే కలిశారన్నారు. మోదీపై తాను ఒంటరి పోరాటం చేస్తానని తేజస్వీ చెప్పారు. నీతీశ్ మరోసారి కూటమి మారబోరని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.
ఆర్జేడీ పాలనలో అవినీతిపై విచారణ
ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం నీతీశ్ కుమార్ మాట్లాడారు. ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో అనేక మతపరమైన అల్లర్లు జరిగాయని, శాంతిభద్రతలు లేవని ఆరోపించారు. ఆర్జేడీ తన పాలనలో అవినీతికి పాల్పడిందని, దానిపై విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. 2005 నుంచి తాను అధికారంలోకి వచ్చాక బిహార్‌లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక మతపరమైన గొడవలు ఆగిపోయాయని చెప్పారు.
త్వరలోనే కొత్త స్పీకర్?
జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ జనవరి 28వ తేదీన ముఖ్యమంత్రి పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా చేశారు. దీంతో ఆర్జేడీతో కలిసి ఆయన ఏర్పాటుచేసిన మహాకూటమి ప్రభుత్వం పతనమైంది. అనంతరం బీజేపీతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అదేరోజు ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. నేడు(ఫిబ్రవరి 12) బలపరీక్షలో నెగ్గారు. త్వరలోనే నూతన స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
ఆరోసారి బీజేపీతో దోస్తీకి సై- మిత్రపార్టీలకు నీతీశ్ మొండిచేయి!
బీజేపీ బిగ్ రివెంజ్- ఏడాదిన్నరలో మళ్లీ బిహార్ పీఠం కైవసం- ఫుల్ జోష్‌తో లోక్‌సభ ఎన్నికలకు!