Aravind Kejriwal Fires On PM Modi : కేంద్రంలో ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆప్ భాగమవుతుందని, అప్పుడు దిల్లీకి రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను జైలు నుంచి విడుదలయ్యాక ఎన్నికల నిపుణులు, ప్రజలతో మాట్లాడానని వారు ఈ సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోదని తనకు చెప్పారని అన్నారు. ఆప్‌ను అణిచివేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
-
#WATCH | Delhi CM Arvind Kejriwal says "...No other party has been harassed to this extent in 75 years. The Prime Minister is saying that he is fighting corruption but all the thieves are in his party. 10 days ago the one who was said to have committed a scam after they made them… pic.twitter.com/EJbSDnL7Pc
— ANI (@ANI) May 11, 2024
"ఆప్ పార్టీకి హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అందుకే అద్భుతం జరిగి (తనకు బెయిల్ రావడాన్ని ఉద్దేశిస్తూ) నేను మళ్లీ మీ మధ్యకు రాగలిగాను. ఆప్ చాలా చిన్న పార్టీ. కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అలాంటి మమ్మల్ని అణచివేసేందుకు ప్రధాని మోదీ ఏ ప్రయత్నాన్నీ వదల్లేదు. నలుగురు నాయకుల్ని జైలుకు పంపించారు. ఒక పార్టీ నుంచి నలుగురు అగ్ర నేతలు జైలుకెళ్తే దాని మనుగడ కొనసాగగలదా? ఆప్‌ను మట్టి కరిపించాలని ప్రధాని భావిస్తున్నారు. తమ పార్టీని సమూలంగా అణచివేయాలని మోదీ కోరుకున్నారు. ఆప్ ఒక్కటే దేశానికి అద్భుతమైన భవిష్యత్తును అందించగలదని ప్రధాని మోదీ కూడా నమ్ముతున్నారు. ఆప్ ఒక పార్టీ కాదు. సిద్ధాంతం. మీరెంత అణగదొక్కితే మేం అంత పైకి లేస్తాం"
--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్తారని దిల్లీ సీఎం ఆరోపించారు. అవినీతిపై పోరాటం చేస్తున్నామని ప్రధాని చెబుతున్నారని, కానీ వారి పార్టీలోనే అవినీతి నేతలంతా ఉన్నారని విమర్శించారు. 'అవినీతిపై పోరాటం ఎలా చేయాలో కేజ్రీవాల్‌ను చూసి నేర్చుకోండి. తప్పు చేస్తే సొంత పార్టీ నేతనే మేం జైలుకు పంపించాం. నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు. తప్పుడు కేసు పెట్టి నాతో రాజీనామా చేయించాలని కుట్ర పన్నినందుకే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరని ప్రధాని మోదీ పదేపదే అడుగుతున్నారు. నేను బీజేపీ ప్రధాని మంత్రి అభ్యర్థి ఎవరని అడుగుతున్నా. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని మోదీ 75 ఏళ్లు పూర్తవుతాయి. 75 ఏళ్ల వయసు దాటినవారు ఏ పదవిలో ఉండకూడదని బీజేపీ ఓ రూల్ పెట్టుకుంది. ఆ నియమం ప్రకారమే బీజేపీ అగ్రనేతలు ఎల్ కె అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ను తప్పించారు. మరి అప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరు?" అని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.
హనుమాన్ గుడిలో పూజలు
అంతకుముందు తన సతీమణి సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి హనుమాన్ ఆలయాన్ని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. కాగా, దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ రావడం వల్ల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం 7లోక్ సభ స్థానాల్లో ఉన్న దిల్లీలో మే 25న పోలింగ్ జరగనుంది.