Amartya Sen On Opposition : లోక్‌సభ ఎన్నికల వేళ భారతదేశ రాజకీయాలపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనైక్యత వల్లే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్‌లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"కుల గణన అనేది మంచి అంశమే. అయితే మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం ద్వారా పేదలకు మరింత సాధికారత కల్పించవచ్చు. భారత దేశం వంటి ప్రజాస్వామ్య దేశపు పౌరుడిగా నేను గర్విస్తున్నాను. అయితే మన దేశపు ప్రజాస్వామిక స్వభావాన్ని పెంపొందించడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. జేడీయూ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు అకస్మాత్తుగా ఎన్‌డీఏ కూటమి వైపు జంప్ కావడం వల్ల ఇండియా కూటమి దేశ రాజకీయాలపై పెద్దగా పట్టును సాధించలేకపోయింది." అని అమర్త్యసేన్ చెప్పారు.
ఒకే మతానికి ప్రభుత్వ ప్రాధాన్యం!
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వపు ఆర్థిక విధానాలపై అమర్త్యసేన్ విమర్శలు గుప్పించారు. నిరక్షరాస్యత, లింగ అసమానతలు భారత దేశంలోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే ప్రతిపక్షాల వాదన గురించి అమర్త్యసేన్‌ను ప్రశ్నించగా, దీని వల్ల ఒకే మతానికి ప్రభుత్వ ప్రాధాన్యం లభించే దిశగా అడుగులు పడతాయని, దేశంలోని సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనమేమీ ఉండదన్నారు. "భారత్ లౌకిక దేశం. కేవలం హిందువులతో ముడిపడిన అంశాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తే అది ఆ ఒక్క వర్గం వారికి సంతోషాన్ని కలగజేస్తుంది. దీనివల్ల దేశ లౌకిక మూలాలు దెబ్బతింటాయి. బహుళ సాంస్కృతిక స్వభావం విచ్ఛిన్నం అవుతుంది" అని అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ తరహా వాతావరణం
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై డెవలప్‌మెంట్ ఎకానమిస్ట్ జీన్ డ్రేజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీల్లోని బీజేపీ వ్యతిరేక స్వరాలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు దేశంలోని లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్ తరహా వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఐదు సంవత్సరాల క్రితం అరుంధతీ రాయ్ 2019 లోక్‌సభ ఎన్నికలను ఫెరారీ, కొన్ని సైకిళ్ల మధ్య పోటీగా అభివర్ణించారు. అదే మాట నేటి పరిస్థితులకూ సరిపోలుతుంది. కార్పొరేట్ రంగం దన్నుతో ఫెరారీ నడుస్తోంది. కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు ఝార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతాదళ్‌లు సైకిళ్లలా మిగిలిపోయాయి. వాటిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది" అని జీన్ డ్రేజ్ ఆరోపించారు. ఈ పార్టీల నాయకులు ఏళ్ల తరబడి కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులను ఎదుర్కొన్నారని చెప్పారు.
బీజేపీకి సవాల్ విసిరే వారికి వేధింపుల రిస్క్
"ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కటకటాల వెనుక ఉన్నారు. లాలూ ప్రసాద్ అడపాదడపా జైలుకు వెళ్లాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. రాహుల్ గాంధీ కూడా త్రుటిలో ఓ కేసు నుంచి బయటపడ్డారు. బీజేపీకి సవాల్ విసిరే ఏ రాజకీయ నాయకుడినైనా వేధించే రిస్క్ పొంచి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు రిగ్గింగ్ తరహా వాతావరణాన్ని అద్దంపడుతున్నాయి" అని జీన్ డ్రేజ్ పేర్కొన్నారు. బెల్జియంలో జన్మించిన జీన్ డ్రేజ్, మన దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా బోధిస్తుంటారు.