Actor Govinda hospitalized : బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నేత గోవిందాకు బుల్లెట్ గాయమైంది. ప్రమాదవశాత్తు ఆయన సొంత తుపాకీ పేలడం వల్ల కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరిలించారు. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున ముంబయిలోని గోవిందా నివాసంలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎవరు ఫిర్యాదు చేయలేదని, దర్యాప్తును ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటలకు కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగిందని గోవిందా మేనేజర్ శశి సిన్హా తెలిపారు. 'మేం కోల్‌కతా వెళ్లేందుకు విమానం ఆరు గంటలకు ఉంది. నేను అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నా. ఆయన అక్కడకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గోవిందా తన లైసెన్స్డ్ రివాల్వర్‌ను తుపాకీ కేసులో పెట్టుకుంటుండగా చేతిలో నుంచి జారి కిందపడి మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ ఆయన కాలిలోకి దూసుకుపోయిందని, వెంటనే సమీపంలోని క్రిటీకేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు దానిని తొలగించినట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు' అని శశి సిన్హా తెలిపారు.
Actor and Shiv Sena leader Govinda says " with the blessings of you all and my parents, the bullet has been removed. i thank the doctors and you for keeping me in your prayers."
— ANI (@ANI) October 1, 2024
govinda was admitted to a hospital after he was accidentally shot in the leg by his own revolver.… pic.twitter.com/9mq60CTy5p
'మీ ప్రేమ వల్లే ప్రమాదం తప్పింది'
ఈ ఘటనపై గోవిందా స్పందించారు. 'నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ వల్లే నేను ఈ ప్రమాదం నుంచి బయటడ్డాను. వైద్యులు కాలులో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు' అని గోవిందా చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవిందాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గోవిందా వేగంగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి వర్గాలకు ముఖ్యమంత్రి సూచించారు.
1963లో పుట్టిన గోవిందా దాదాపు 165పైగా చిత్రాల్లో నటించారు. లోక్‌సభ ఎన్నికలకు ఒక నెల ముందు ఆయన ఏకనాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గోవిందా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చివరిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నార్త్ ముంబయి లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.