తిరుమల బ్రహ్మోత్సవాలు: మోహినీ అవతారంలో దేవదేవుడి దర్శనం - తితిదే
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన బుధవారం శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకీలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడిగా అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి కర్పూర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. రాత్రి 7గంటల నుంచి 8.30 వరకు గరుడసేవ జరగనుంది. గరుడ సేవ సందర్భంగా స్వామివారికి ఏపీ సీఎం జగన్ సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.