Yadadri Temple Latest News : యాదాద్రి వైకుంఠ ద్వారం చెంతగల గోపురానికి కొత్త హంగులు - హైదరాబాద్ తాజ వార్తలు
Published : Oct 16, 2023, 1:26 PM IST
Yadadri Temple Latest News : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో వైకుంఠ ద్వారం మెట్ల దారి చెంతగల గోపురానికి కృష్ణశిల హంగులు చేపడుతున్నారు. ఇప్పటికే.. పంచనారసింహుల సన్నిధి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిల రాతితో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అత్యంత అద్భుతంగా కనిపించే విధంగా కృష్ణశిల హంగులతో పాటు దీపకన్యలను తీర్చిదిద్దారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికను పెంపొందించే విధంగా ఆలయ పరిసరాల్లో కట్టడాల నిర్మాణం చేపడుతున్నారు.
మెట్ల దారి నిర్మాణం గుండా భక్తులు కొండపైకి చేరుకునే విధంగా యాడా అధికారులు వసతులు కల్పిస్తున్నారు. గోపురం వద్ద భక్తి భావం విలసిల్లేలా.. శంకు, చక్ర, తిరుణామాలను ఏర్పాటు చేశారు. కాగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి.. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.