Woman Gave Birth On Road : గర్భిణిని భుజాలపై మోస్తూ 4కి.మీ నడక.. మార్గమధ్యలోనే ప్రసవం.. సీఎం దత్తత గ్రామంలో..
Published : Oct 2, 2023, 5:47 PM IST
Woman Gave Birth On Road : గిరిజన గర్భిణిని భుజాలపై మోస్తూ నాలుగు కిలోమీటర్లు నడిచారు గ్రామస్థులు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల భుజాలపై ఎత్తుకెళ్లారు గ్రామస్థులు. అయితే, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ మహిళ. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
శహర్పుర్ తాలుకాలోని పటికచపడ గ్రామానికి చెందిన గర్భిణికి ఆదివారం పురిటినొప్పులు మొదలయ్యాయి. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అంబులెన్స్ సహా ఎలాంటి వాహనం వచ్చేందుకు వీలు లేదు. దీంతో గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు.. భుజాలపై ఆమెను ఎత్తుకెళ్లారు గ్రామస్థులు. అయితే, ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక ఆశా కార్యకర్త.. గ్రామస్థుల సాయంతో ఆ మహిళకు ప్రసవం చేసింది. అనంతరం ఓ ప్రైవేట్ వాహనంలో తల్లీబిడ్డలను కాసర ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.
తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. ఠాణె ఇంచార్జీ మంత్రిగా ఉన్న సమయంలో తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. అయినా తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని వాపోయారు. అనేక మంది అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యకం చేశారు.