కుండపోత వర్షంలో వివాహ వేడుక.. గొడుగు వేసుకుని 'ఏడడుగులు' నడిచిన జంట
కుండపోత వర్షంలోనూ వివాహ వేడుక జరిగింది. జోరుగా వర్షం పడుతుండగానే గొడుగు పట్టుకుని వధూవరులు ఏడడుగులు వేశారు. పూజారి కూడా దూరంగా నిలబడి మంత్రాలు చదివారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ జిల్లాలో జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాలలో గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలోనే ఓ ప్రాంతంలో పెళ్లి వేడుక నిర్వహించారు. ఇంతలో వర్షం కురిసింది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన మండపంలోకి నీళ్లు రావడం మొదలైంది. దీంతో పూజారితో పాటు పెళ్లికి వచ్చిన వాళ్లు వర్షంలో తడవకుండా ఇంట్లోకి పరుగుతీశారు. కానీ ముహూర్తం దగ్గర పడటం వల్ల వధూవరులకు ఆ ఛాన్స్ రాలేదు. పూజారి వర్షంలో తడవకుండా వరండాలో కూర్చొని మంత్రాలు చదువుతుండగా.. నూతన వధూవరులు ఏడడుగులు వేశారు. భార్య ముందు నడుస్తుండగా.. గొడుగు పట్టుకుని ఆమె అడుగులో అడుగు వేశాడు భర్త. పెళ్లికి వచ్చిన అతిథులు ఈ తంతును వీక్షిస్తూ.. కేరింతలు, చప్పట్లు కొట్టారు. మరికొందరు ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.