Third genders fight in Miryalaguda : హిజ్రాల మధ్య ముదిరిన వివాదం.. రణరంగంగా మారిన పోలీస్‌స్టేషన్ - Third gender fight in Nalgonda
Third genders fight at Miryalaguda police station : ఆర్థిక లావాదేవీలలో హిజ్రాల మధ్య ముదిరిన వివాదం పోలీస్ స్టేషన్‌ను రణరంగంగా మార్చింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన పలువురు హిజ్రాలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వన్‌టౌన్ స్టేషన్లో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. నల్గొండ పట్టణంలో ఉంటున్న ఓ హిజ్రా నాయకురాలు మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, మాల్ వద్ద 10 నుంచి 12మంది హజ్రాలను ఏర్పాటు చేసి నెలవారి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఇది నచ్చని మిర్యాలగూడ హిజ్రాలు డబ్బులు ఇవ్వడానికి వ్యతిరేకించడంతో వారి మధ్య గొడవలు ముదిరాయి. ఓ వర్గం వారు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి రాగా అది తెలిసిన మరో వర్గం కూడా స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య మాటలు పెరిగి.. అది కాస్త దాడులకు దారి తీశాయి. ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని.. మరో వర్గం వారికి వత్తాసు పలుకుతున్నారని కొందరు హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు.