Special Medical Team for Chandrababu in Jail: రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు..
Published : Sep 16, 2023, 12:11 PM IST
Special Medical Team for Chandrababu in Jail: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక వైద్య బృందం 5రోజుల తర్వాత ఏర్పాటైంది. మెుత్తం 10 మందితో వైద్య బృందాన్ని వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు సహా కలిపి బృందంగా ఏర్పాటు చేశారు. 2 యూనిట్ల 'O' పాజిటివ్ రక్తం నిత్యం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దీంతోపాటు ఇతర అత్యవసర మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వైద్యశాఖ ఆదేశించింది. చంద్రబాబు జైలుకు వెళ్లి 5రోజులు గడిచిన తర్వాత నిర్ణయం తీసుకోవడం పట్ల తెలుగుదేశం నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఎందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
కాగా.. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును శుక్రవారం కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి పెట్టుకున్న ములాఖత్ ధరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా ధరఖాస్తును తిరస్కరించడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ములాఖత్ విషయంలో కూడా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తంచేశారు.