శిర్డీలో ఘనంగా దీపోత్సవం - పదకొండు వేల దీపాలు వెలిగించి 'సబ్ కా మాలిక్ ఏక్' సందేశం - శిర్డీ సాయిబాబా
Published : Nov 13, 2023, 12:40 PM IST
|Updated : Nov 13, 2023, 4:38 PM IST
Shirdi 2023 Deepotsavam Updates: దీపావళి పండగను పురస్కరించుకుని మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా ఆలయం దివ్వెల వెలుగులతో మెరిసిపోయింది. ఆలయ ముఖద్వారం మొదలుకొని ద్వారకామాయి ప్రాంగణం వరకు ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. దీపావళి రోజున షిర్డీలోని క్రాంతి యువకుల మండలం ద్వారకామాయి ప్రాంగణంలో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని.. పదకొండు వేల దీపాలు వెలిగించారు.
Shirdi Saibaba Temple: దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఈ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది దీపావళిని పురస్కరించుకుని శిర్డీ సాయిబాబా ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో మూడు రోజులపాటు దీపోత్సవం జరుపుకొంటారు. ఈ ఏడాది మొదటి (దీపావళి) రోజున షిర్డీలోని క్రాంతి యువకుల మండలం ద్వారకామాయి ప్రాంగణంలో దీపోత్సవం ఘనంగా జరిగింది. సుమారు పదకొండు వేల దీపాలు వెలిగించి 'సబ్ కా మాలిక్ ఏక్' సందేశమిచ్చారు.
'దీపావళి పండుగ రోజున ప్రతి ఏడాది శిర్డీ సాయిబాబా ఆలయంలో మూడు రోజులు దీపోత్సవం జరుగుతుంది. వేలాది మంది భక్తులు పాల్గొని లక్షలాది దీపాలు వెలిగిస్తారు. మొదటి రోజు లక్ష్మిపూజ జరిగింది. ఆ పూజ కార్యక్రమంలో సాయినాథ్‍ని వద్దనున్న బంగారం, విలువైన వస్తువులకు పూజలు చేశాం.' - శిర్డీ సాయిబాబా ఆలయం అధ్యక్షులు