పోలీసుల్లా నటించి రూ.14 కోట్ల బంగారు ఆభరణాలు చోరీ.. లైవ్ వీడియో - నగల దుకాణాన్ని చోరీ చేసిన దుండగులు
Maharashtra jewellery shop robbery live video : పట్టపగలే 8 మంది దొంగలు ఓ నగల దుకాణంలోకి పోలీసుల్లా ప్రవేశించి 14 కోట్ల రూపాయలు విలువైన నగలను దోచుకెళ్లిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. సాంగ్లీలోని ఓ నగల దుకాణంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ భారీ దోపిడీ సంచలనం రేపింది. 8 మంది దొంగలు పోలీసుల్లా నటిస్తూ రిలయన్స్ జ్యువెల్లరీ నగల దుకాణంలోకి ప్రవేశించారు. అనంతరం సిబ్బంది, వినియోగదారులను తుపాకులతో బెదిరించి బందీలుగా చేశారు. ప్రతిఘటించిన ఓ వ్యక్తిపై కాల్పుల జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తికి గాయాలైనట్లు.. దుకాణంలోని అద్దాలు సైతం ధ్వంసమైనట్లు వివరించారు. అనంతరం బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని చెప్పారు.
దుండగులు రెండు కార్లలో వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ బృందం, స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించి జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 14కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.