Ramoji Foundation: నిరుపేద విద్యార్థుల కోసం రామోజీ ఫౌండేషన్ విరాళం - రామోజీ ఫౌండేషన్
Ramoji Foundation Donation: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని లక్కవరం విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు.. రామోజీ ఫౌండేషన్ 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. సంబంధిత చెక్కును రాజమహేంద్రవరంలోని 'ఈనాడు' కార్యాలయంలో శిశు మందిర్ నిర్వాహకులకు యూనిట్ ఇన్‌ఛార్జి టీవీ చంద్రశేఖరప్రసాద్ అందజేశారు. చెక్కుతోపాటు రామోజీ సంస్థలు, ఫౌండేషన్ ఛైర్మన్ రామోజీరావు ఓ లేఖను జత చేశారు. మూడున్నర దశబ్దాలకుపైగా లక్కవరం ఆ పరిసరాల్లోని ఏడెనిమిది గ్రామాల్లోని నిరుపేద విద్యార్థుల కోసం శ్రీ సరస్వతీ శిశు మందిర్ చేస్తున్న సేవలను రామోజీరావు కొనియాడారు. 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిసి సంతోషించానన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న శిశుమందిర్ సేవలు కాలానుగుణంగా విస్తరించడాన్ని ప్రశంసించారు. శిశుమందిర్‌లో గ్రామీణ పేద విద్యార్థులకు సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ల్యాబ్ స్థాపనకు అవసరమైన 10 లక్షల రూపాయలు అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.