Raghunandan Comments On Congress : 'యూపీఏ పేరుకు ఓట్లు పడడం లేదనే.. ఇండియా కూటమి' - ఇండియా కూటమి
Raghunandan Rao Fires On India Alliance : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ అనే పేరును మార్చుకొని 26 పార్టీలతో ఇండియా అని పేరుపెట్టుకున్న ఈస్ట్ ఇండియా కూటమికి భారత ప్రజలు గుణపాఠం చెపుతారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో భారత్ వర్సెస్ ఈస్ట్ ఇండియా కూటమి పెట్టుకున్న ఇండియాకు మధ్య జరిగే యుద్ధమని ధ్వజమెత్తారు. గజ్వేల్ పట్టణంలో ఇటీవల ఇరువర్గాల ఘర్షణల్లో జైలుకు వెళ్లిన ఓ వర్గానికి చెందిన పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం రఘునందన్‌రావు మాట్లాడుతూ.. వామపక్ష పార్టీలు.. యూపీఏ కూటమిని ప్రజలు నమ్మడం లేదనే పేరుతో యూపీఏ పేరును ఇండియాగా మార్చుకొని ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 26 పార్టీల కూటమికి భారత ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. యూపీఏ పేరు ఉన్నప్పుడే బీజేపీకి 300 నుంచి 350 సీట్లు వచ్చాయి.. మరి 26 పార్టీల కూటమి ఇండియా అనే పేరుపెట్టుకోవడంతో బీజేపీ 400 సీట్లు తెచ్చుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చే విధంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కృషి చేస్తుందని రఘునందన్‌రావు పేర్కొన్నారు.