తిరుమల శ్రీవారి సేవలో ప్రధాని మోదీ- తీర్థప్రసాదాలతో సత్కరించిన ఆలయ అధికారులు
Published : Nov 27, 2023, 11:08 AM IST
Prime Minister Modi visited Tirumala:ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి.. తీర్థప్రసాదాలు అందించారు. చివరగా ఆలయ అధికారులు ప్రధానికి శ్రీవారి చిత్రపటం, క్యాలెండర్, డైరీ అందించారు. మోదీ ప్రధాని హోదాలో శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. శ్రీవారి దర్శనం ముగిసిన తరువత తిరుపతి విమానాశ్రయానికి చేరుకోని హైదరాబాద్ వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు.
Kartika Deepotsavam at Tirumala:తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా టీటీడీ అర్చకులు,అధికారులు నిర్వహించారు.. మొదటిగా యోగనరసింహస్వామి ఆలయం పక్కనవున్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతిని ఇచ్చారు. గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు.