Godavari Harathi In Bhadradri : గోదారమ్మకు నదీ హారతి.. కనిపించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
Godavari River Harathi In Bhadradri : భద్రాద్రి రామయ్యకు సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు రామయ్య సన్నిధి అర్చకులు గోదారమ్మకు నదీహారతులు అందించారు. అయితే ఇన్ని రోజుల వరకు ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షణలో ఘనంగా జరిగిన ఉత్సవాలు.. నేడు మాత్రం ఈవో లేకపోవడంతో నిర్లక్ష్య ధోరణి కనిపించింది. సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన ఉత్సవ కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటలైన ప్రారంభించలేదు. గోదావరి నదికి హారతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాల్సి ఉన్నా.. తూతూ మంత్రంగా మాత్రమే పూర్తి చేశారు. గోదావరి నది ప్రాంతం మొత్తం చీకటిగా ఉన్నప్పటికీ దేవస్థానం అధికారులు లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. చీకటిలోనే తూతూ మంత్రంగా హారతులు అందించి.. మమ అనిపించారు. భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన నదీహారతుల ఉత్సవాన్ని సిబ్బంది నిర్లక్ష్యంగా నిర్వహించి.. చేతులు దులుపు కున్నారు. ముందుగా గోదారమ్మకు పూజలు చేసిన అర్చకులు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామ నామ మంత్రంతో హారతులు అందించారు.