సాయంత్రం నుంచి దక్కన్మాల్ భవనాన్ని కూల్చనున్న అధికారులు - దక్కన్ మాల్ భవనం కూల్చివేతకు సిద్ధమైన అధికారులు
Demolish Secunderabad fire building: ఇటీవల సికింద్రాబాద్ అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని ఈరోజు సాయంత్రం నుంచి కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గుత్తేదారుకు అన్ని శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 15రోజుల పాటు భవనం కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే గుత్తేదారు భవనం కూల్చివేతకు రెండు భారీ యంత్రాలను తీసుకొచ్చారు. సమీప నివాసితులను అధికారులు జీహెచ్ఎమ్‌సీ శిబిరాలకు తరలించారు.
దక్కన్ మాల్ కూల్చివేత సమయంలో పక్క భవనాలు దెబ్బతింటే, తగిన నష్టపరిహారం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం అందించామని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తలసాని వెల్లడించారు. నల్లగుట్టలోని దక్కన్ మాల్ భవనాన్ని తలసాని పరిశీలించారు. కూల్చివేతలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచించారు. వీలైనంత తొందర కూల్చివేత ప్రక్రియ ముగించాలని అధికారులను ఆదేశించారు.
సుమారు 41 లక్షల రూపాయల ఖర్చుతో కూల్చివేత ప్రక్రియ జరుగుతుందుని... టెండర్లు ఖరారయ్యాయని మంత్రి తలసాని తెలిపారు. దెబ్బతిన్న చుట్టు పక్కల నిర్మాణాలను చక్కదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు, అగ్నిమాపక జాగ్రత్తలు లేని భవనాలకు సంబంధించిన అంశాలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తలసాని తెలిపారు. ఇలాంటి భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. వెంటనే కూల్చివేతలు చేపట్టలేమని.. భవనాల్లో ఉంటున్న వారికి అవగాహన కల్పిస్తామని తలసాని అన్నారు. అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేసేలా.. సెల్లార్, గోదాముల వినియోగంపై చైతన్యం కలిగిస్తామన్నారు. చిన్న అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన ఉందన్నారు.