MLC Kavitha on Rahul Gandhi Comments : సత్య దూరమైన మాటలు చెప్పడం రాహుల్ గాంధీకి అలవాటే: ఎమ్మెల్సీ కవిత - రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కవిత రియాక్షన్
Published : Sep 25, 2023, 7:08 PM IST
MLC Kavitha on Rahul Gandhi Comments : తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న కవిత.. సత్య దూరమైన మాటలు చెప్పడం రాహుల్ గాంధీకి అలవాటేనని పేర్కొన్నారు. మరోసారి తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ ఏమన్నారంటే..: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో మాత్రం కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్లోనూ తిరిగి అధికారం చేజిక్కుంచుకుంటామని తెలిపారు. ఆదివారం దిల్లీలో జరిగిన 'ది కాంక్లేవ్ రెండో ఎడిషన్' చర్చా కార్యక్రమంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
బీసీలకు కోటాపై కొట్లాడతాం..: మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నామని కవిత పేర్కొన్నారు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు మరో 6 నెలల ముందు ఈ బిల్లును ప్రవేశపెట్టడం రాజకీయ స్టంట్ అని విమర్శించారు. బీసీలకు కోటాపై కొట్లాడతామని ఆమె స్పష్టం చేశారు.