MLA Raghunandan Rao Latest Comments : రంగులు వెలిసిపోయినా.. పేదవానికి ఇళ్లు రావట్లేదు! - Raghunandan Rao comments on kcr
Raghunandan Rao Speech about Double Bed Room: ఆగస్టు 30లోపు అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లని ఇవ్వాలని.. అలా జరగకపోతే బీజేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారులందరిని నిర్మించిన డబుల్ బెడ్రూంల్లోకి పంపిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ చేపట్టిన ధర్నాకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూంలు ఇప్పటికే నిర్మించి 5 సంవత్సరాలు అవుతుందని.. లీకేజ్‌లు వస్తున్నాయని అన్నారు. కనీస సౌకర్యాలు నాశనం అవుతున్నాయని ఆరోపించారు. ఆ ఇళ్లు అన్నింటికి రెండు, మూడు సార్లు రంగులు వేశారని విమర్శించారు. రంగులు వెలసిపోయినా.. పేదవారికి ఇళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో గృహలక్ష్మీ పథకం కింద ప్రతి పేదవారికి రూ.3లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తారన్న విషయం గుర్తు చేశారు. ఆ నగదును వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న గిరిజనులకు గిరిజన బంధు ప్రకటించి.. రూ.10లక్షలు ఇవ్వాలని సూచించారు.