కాంగ్రెస్ పెద్దలు హామీలిస్తారు, రాష్ట్ర నేతలు చేతులెత్తేస్తారు : తలసాని - కాంగ్రెస్‌పై మండిపడ్డ మంత్రి తలసాని
Published : Nov 11, 2023, 4:36 PM IST
Minister Talasani Fires on Congress Party : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని చెప్పిన ఆ పార్టీ.. కేవలం 22 మందికే టికెట్ ఇచ్చిందని విమర్శించారు. టికెట్లు ఇవ్వట్లేదని కాంగ్రెస్ బీసీ నేతలు దిల్లీలో ఎలా ఆందోళన చేశారో చూశామన్నారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అన్న మంత్రి.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే తాము ఇవ్వలేదని స్థానిక నేతలు అంటారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈ నెల 17 నుంచి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్‌షో ఉంటుందని తలసాని పేర్కొన్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని.. గ్రేటర్ హైదరాబాద్‌లో తమ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు భారత్ రాష్ట్ర సమితి పట్ల విశ్వాసం ఉందన్న ఆయన.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ మూడోసారి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.