పొలంలో పనిచేస్తున్న రైతుపై చిరుత దాడి.. కూతురు పట్టుకున్న కర్ర చూసి జంప్!
ఉత్తర్ప్రదేశ్లో పొలంలో పని చేస్తున్న ఓ రైతుకు ఊహించని ఘటన ఎదురైంది. అకస్మాత్తుగా వచ్చిన ఓ చిరుత అతడిపై దాడి చేసింది. సమీపంలోనే ఉన్న రైతు కుమార్తె అప్రమత్తమై కర్రతో చిరుత వైపు రావడం వల్ల అక్కడి నుంచి పారిపోయింది.
ఇదీ జరిగింది..
పీలీభీత్ జిల్లాలోని సంతోష్‌పురా గ్రామానికి చెందిన డోరీలాల్(40).. తన కుమార్తె గోమతితో కలిసి సోమవారం ఉదయం పొలానికి వెళ్లాడు. డోరీలాల్ పొలంలో పనిచేస్తున్న సమయంలో పొదల్లో నుంచి బయటకు వచ్చిన ఓ చిరుతపులి అతడిపై దాడి చేసింది. సమీపంలోనే ఉన్న అతడి కుమార్తె గోమతి ధైర్యం ప్రదర్శించి కర్రతో చిరుతను తరిమికొట్టింది. ఆ తర్వాత చిరుత పారిపోయింది. ఘటన అనంతరం వెంటనే రైతును దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు తరలించారు.
చిరుత సంచారంపై సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది.. దాన్ని పట్టుకునేందుకు సంతోష్‌పురా గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ వ్యక్తి చిరుతకు దగ్గరగా వెళ్లాడు. ఆందోళనకు గురైన చిరుతపులి అతడిపై దాడి చేసి పారిపోయింది. చిరుతను పట్టుకుంటామని గ్రామస్థులకు అధికారులు హామీ ఇచ్చారు.