KTR Tweet On Haritha Haram : 'హరితహారం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం'
Minister KTR On Haritha Utsavam :దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం 'హరితహారం' అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ హరితహారం మహోద్యమంలా సాగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికక్కక కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటుతూ.. స్థానికుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా 'హరితోత్సవం' కార్యక్రమాన్ని పురస్కరించుకుని ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హరితహారం పార్కుల ఛాయా చిత్రాలు ట్విటర్‌లో జత చేసి తన స్పందనను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక హరితహారం కార్యక్రమం కింద 230 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ప్రపంచ చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ద్వారా 33 శాతం గ్రీన్ కవర్ సాధించడమే ఆశయమని తెలిపారు. ఈ హరితహారం పుడమి తల్లికి వెలకట్టలేని ఆభరణం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.