Karnataka Bus Fire In Maharashtra : ఆగని మరాఠాల ఆందోళనలు.. కర్ణాటక ఆర్టీసీ బస్సుకు నిప్పు.. ప్రయాణికులు సేఫ్! - మహారాష్ట్రలో కర్ణాటక ఆర్టీసీ బస్సుకు నిప్పు
Published : Oct 31, 2023, 12:29 PM IST
Karnataka Bus Fire In Maharashtra :మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ జరుగుతున్న నిరసనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటికి, ఆపై జిల్లా మున్సిపల్ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. కర్ణాటక నుంచి ప్రయాణికులతో మహారాష్ట్రలోని ఓమెర్గాకు వస్తున్న KA38F1201 నంబర్ బస్సును సోమవారం రాత్రి 8:30 నిమిషాల సమయంలో దగ్ధం చేశారు మరాఠా నిరసనకారులు. అంతేకాకుండా రోడ్లను దిగ్బంధనం చేశారు. స్థానికంగా బంద్‌లకు పిలుపునిస్తున్నారు. ఇక బస్సు ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఉమర్గా పోలీస్ ఇన్స్పెక్టర్ డీ.బీ.పాలేకర్ సంఘటనా స్థలిని పరిశీలించారు. బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు.. ఫైర్ ఇంజన్ వచ్చేలోపే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
మరోవైపు.. నిరసనలు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరగకుండా ధారాశివ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు ఆ జిల్లా కలెక్టర్ డా.సచిన్ ఓంబసే. రవాణా, అత్యవసర సేవలు సహా మరికొన్నింటికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది రోడ్లపై తిరగరాదని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.