Kaleshwaram project : కాళేశ్వరానికి జలకళ.. మేడిగడ్డ వద్ద 36 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
Kaleshwaram Lift Irrigation Project :గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలోకినైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. రుతుపవనాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అంతగా వర్షాలు కురవడం లేదు. వానలు లేకపోయినా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు అంతా జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర నుంచి ప్రాణాహితకి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో ఈ సీజన్లో తొలిసారి గేట్లు ఎత్తారు. మేడిగడ్డ బ్యారేజిలోకి లక్షా 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 36 గేట్లు ఎత్తి... లక్షా 10 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం నీటినిల్వ 14.13 టీఎంసీలకు చేరింది. కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ నుంచి ఏడు మోటార్ల ద్వారా నీటిని అన్నారం బ్యారేజ్‌కు తరలిస్తున్నారు. సరస్వతి బ్యారేజిలో ప్రస్తుతం 8.02 టీఎంసీల నీటి నిల్వ చేరుకుందని అధికారులు వివరించారు.