14 అడుగులు.. 45 కిలోల భారీ కొండచిలువ.. గొర్రెలపై అటాక్.. చివరకు.. - huge python in mandya
కర్ణాటక మండ్య జిల్లాలోని చామనహళ్లి గ్రామంలో ఓ భారీ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. దాదాపు 14 అడుగుల పొడవు, 45 కిలోల బరువున్న కొండచిలువ.. శింషా నది తీరాన మేస్తున్న గొర్రెల మందపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. చామనహళ్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి తగడయ్యకు బుధవారం సాయంత్రం గొర్రెలను మేపుతుండగా భారీ కొండచిలువ కనిపించింది. గొర్రెల మందపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అతడు గొర్రెలను కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశాడు. ఇది విన్న గ్రామస్థులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే గుంపులోని ఓ గొర్రె పిల్లను అది మింగేందుకు ప్రయత్నించిందని.. తాను అరవడం వల్ల అది భయంతో చెట్ల పొదల్లోకి వెళ్లిపోయిందని కాపరి తెలిపాడు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన స్నేక్ టీమ్ సభ్యుడు రవికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అతడు.. సుమారు 30 నిమిషాలకు పైగా శ్రమించి చాకచక్యంగా కొండచిలువను పుట్టుకున్నారు. అనంతరం కొండచిలువను సురక్షితంగా శింషా నది ఒడ్డున వదిలేశాడు. ఇదిలా ఉంటే ఇంత పెద్ద సైజులో ఉన్న కొండచిలువను చూసిన చిన్నారులు, యువకులు దాంతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.