Justice Ujjal Bhuyan Starts Legal Service System: 'పేదలకు న్యాయం మరింత చేరువయ్యేలా న్యాయ సేవ వ్యవస్థలు దోహదపడాలి'
పేదలకు న్యాయం మరింత చేరువయ్యేలా న్యాయ సేవ వ్యవస్థలు దోహదపడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆకాంక్షించారు. ఇవాళ మరో 17 జిల్లాల్లో న్యాయ సేవ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థను సీజే హైకోర్టు నుంచి ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు. ఫిబ్రవరిలో తొలి దశలో 16 జిల్లాల్లో ప్రారంభించారు. న్యాయసేవ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థలో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు న్యాయవాదులను లీగల్ సర్వీసెస్ అథారిటీ నియమించింది. పేదలు, అర్హులైన నిందితులు, ఖైదీలకు బెయిల్, ట్రయల్, అప్పీలు వంటి సేవలను అందిస్తారు.
నేటితో రాష్ట్రవ్యాప్తంగా న్యాయసేవ న్యాయవాదుల వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. జైళ్లలో ఎక్కువగా విచారణ ఖైదీలే ఉన్నారని.. వారిలో ఎక్కువగా పేద, అణగారిన వర్గాలకు చెందిన వారేనని సీజే పేర్కొన్నారు. అవసరమైన వారికి, అర్హులకు తగిన సేవలు అందించడంలో లీగల్ సర్వీసెస్ ముందుండాలని కోరారు. ఫిబ్రవరిలో మొదటి విడతలో 16 జిల్లాల్లో న్యాయసేవ న్యాయవాదులకు 824 కేసులు అప్పగించగా.. వాటిలో 104 విచారణ పూర్తయిందని రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కార్యనిర్వాహక ఛైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.