నదిలో కొట్టుకుపోయిన ప్రభుత్వ పాఠశాల.. 27 సెకన్లలో కుప్పకూలి!
Government School Washed Away In River : ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో ఓ ప్రభుత్వ పాఠశాల.. నదిలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే?
గత కొద్దిరోజులుగా ఉత్తర్‌ప్రదేశ్, దాని పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో శారదా నది ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. నది పరివాహక ప్రాంతంలోని గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. శారదా నది ఉద్ధృతికి కర్దాహియా మన్‌పుర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల.. గురువారం కొట్టుకుపోయింది. 27 సెకన్ల వ్యవధిలో స్కూల్ నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
చాలా రోజులుగా పాఠశాల భద్రతకు కృషి చేస్తున్నామని కర్దాహియా మన్‌పుర్ గ్రామపెద్ద ప్రీతమ్ యాదవ్ తెలిపారు. రెండు రోజుల క్రితం అధికారులు గ్రామాన్ని పరిశీలించినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. శారదా నది ఉద్ధృతి వల్ల గత ఐదేళ్లలో సుమారు 200 ఇళ్లు నదిలో కొట్టుకుపోయాయని తెలిపారు.