ఒక్క ఎమ్మెల్యేను తీసుకుంటే అక్కణ్నుంచి పది మంది వస్తారు : గంగుల - గంగుల కమలాకర్
Published : Jan 4, 2024, 8:30 PM IST
Gangula Kamalakar on Congress MLAs Joinings in BRS : భారత రాష్ట్ర సమితి నుంచి ఒక్క ఎమ్మెల్యేను తీసుకుంటే అక్కణ్నుంచి పది మంది వస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) వ్యాఖ్యానించారు. తమకు కేసీఆర్ దైవసమానులని, ఎమ్మెల్యేలు అందరూ పూర్తిగా కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు. తాము గేట్లు తెరిస్తే చాలా మంది వస్తారని అన్నారు. కేవలం నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు.
గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది తాము కాదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు గంగుల సమాధానంగా చెప్పారు. ఇంకా రైతుబంధు నిధులు పడలేదని నిధులు వెంటనే విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు గంగుల తెలిపారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని, 500 బోనస్‌తో పంట కొనుగోళ్లను మూడు నెలల ముందే గుర్తు చేస్తున్నామని అన్నారు. బీజేపీ నేతలే అంతర్గతంగా పోట్లాడుకొని వారిని వారే కూకటి వేళ్లతో పెకిలించుకుంటారన్న కమలాకర్, మూడు సార్లు ఓడిపోయింది బండి సంజయ్ కాదా అని ప్రశ్నించారు. బీజేపీ బీసీ సీఎం అభ్యర్థులు ముగ్గురిని ఓడించింది బీఆర్ఎసేనని గుర్తు చేశారు.