Ganesh Immersion in Hyderabad 2023 : గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ఈసారి మరింత పెంచాం: మంత్రి తలసాని - Razakar movie
Published : Sep 19, 2023, 12:59 PM IST
Ganesh Immersion in Hyderabad 2023 : హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రేపటి నుంచి వినాయక నిమజ్జనాలు ప్రారంభం కానున్న వేళ.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సంవత్సరం నిమజ్జనం ఏర్పాట్లను మరింతగా పెంచినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 వేల వినాయక ప్రతిమలను ప్రతిష్టించినట్లు మంత్రి తలసాని వివరించారు. ఎవరు, ఎక్కడ నిమజ్జనం చేయాలో.. ముందుగానే అందరికీ సమాచారం అందించామన్నారు. గణేశ్ ఉత్సవ సమితి సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ఆమోదం సరైన నిర్ణయమేనని తలసాని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై.. బీఆర్ఎస్ మొదటి నుంచీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. తెలంగాణపై అమిత్‌షా, మోదీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. కేంద్రమంత్రిగా ఉండి సాధారణ వ్యక్తిగా వ్యాఖ్యలు చేయడం అమిత్‌షాకు తగదని హితవు పలికారు. మరోవైపు.. రజాకార్ చిత్రంపైనా తలసాని స్పందించారు. తెలంగాణ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా సినిమాలు వస్తే ఊరుకోమని హెచ్చరించారు. రజాకర్ చిత్రంలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే.. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నారు. మంత్రితో పాటుగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు హాజరయ్యారు.