Gaddar Sand Art Create in Karimnagar : తెలంగాణ నేలతల్లి ముద్దుబిడ్డ గద్దరన్నకు సైకత జోహార్లు - Gaddar death news
Gaddar Sand Art Create in Karimnagar : ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణవార్తతో యావత్ తెలుగు ప్రపంచం తల్లడిల్లింది. మూగబోయిన తెలంగాణ విప్లవ కెరటానికి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించారు. తాజాగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన శంకర్ అనే సైకత శిల్ప కళాకారుడు తనదైన శైలిలో నివాళులు అర్పించారు. కరీంనగర్ మంకమ్మ తోట పరిధిలో గద్దర్ సైకత శిల్పాన్ని(Gaddar Sand Art Image) రూపొందించి ఆయనను స్మరించుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన శంకర్ మహనీయుల జన్మదినం, వర్ధంతి సందర్భంగా వారి సైకత శిల్పాలను రూపొందించి నివాళులర్పిస్తుంటారు. ఇందులో భాగంగా గద్దర్ ప్రతిమను ఇసుకతో చెక్కారు. ప్రజా గాయకుడు గద్దర్ గుండె సంబంధిత అనారోగ్యంతో.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సంతాపంగా ఇసుకతో ఆయన శిల్పాన్ని శంకర్ రూపొందించారు. ఇందుకోసం ఆయన దాదాపు 5 గంటలు శ్రమించారు. ఒక కళాకారుడుగా, ప్రజా ఉద్యమ పోరు బాటను తన పాటల ద్వారా ఉర్రూతలూగించిన ఆ మహనీయుడి రూపాన్ని చెక్కటంతో తన సైకత కళకు సార్ధకం చేకూరిందని అభివర్ణిస్తూ శంకర్ గద్దర్‌కు జోహార్లు పలికారు.