Gaddar Daughter Vennela Hopes for Congress ticket : కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీకి సిద్ధం : గద్దర్ కుమార్తె వెన్నెల - కాంగ్రెస్ నుంచి బరిలోకి వెన్నెల రెడీ
Published : Oct 21, 2023, 5:59 PM IST
Gaddar Daughter Vennela Hopes for Congress ticket :రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల తెలిపారు. టిక్కెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా.. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై వారు స్పందించారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేసి.. ప్రజల కోసం కొట్లాడే పోటీతత్వం మాలో ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో కంటోన్మెంట్ సీటు ఇస్తే.. కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తామన్నారు. గద్దర్ చివర్లో కాంగ్రెస్‌కు మద్దతుగా పని చేశారని.. ఎన్నికల్లో పోటీ చేయాలని అనేవారన్నారు.
పోటీ చేసి ఓడిపోయినా సరే తన తండ్రి ఆశయసాధన మేరకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు వెన్నెల వెల్లడించారు.. గద్దర్ జీవితాంతం సమసమాజం కోసం తపన పడ్డారన్నారు. రాజ్యాంగాన్ని అమలు పర్చాలని కోరుకునేవారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తామని కాంగ్రెస్ అంటోందని.. అందుకే ఆ పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ వెన్నెలకు టిక్కెట్ ఇస్తే.. ఆమె తరపున ప్రచారం చేస్తానని గద్దర్ భార్య విమల అన్నారు.