ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. లోపల 120 మందికిపైగా రోగులు.. టెన్షన్ టెన్షన్!
Fire Accident In Hospital : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ఓ పది అంతస్తుల ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి బేస్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 125 మంది రోగులను వేర్వేరు ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే?
నగరంలోని సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న 'రాజస్థాన్ హాస్పిటల్'లో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఆస్పత్రిని ఓ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది.
మంటలు చెలరేగడం వల్ల చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ఎంత మేరకు ఆస్తినష్టం జరిగిందనేది ఇంకా నిర్ధరించాల్సి ఉందని చెప్పారు. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడం వల్ల సహాయక చర్యలు ప్రారంభించడం కాస్త ఆలస్యం అయిందని వివరించారు.