సిద్దిపేటలోని ప్రైవేట్ పాఠశాలలో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణాపాయం - సిద్దిపేటలో అగ్ని ప్రమాదం
Published : Dec 1, 2023, 9:22 PM IST
Fire Accident at School in Siddipet :రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పాఠశాల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ధనార్జనే ధేయంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని తృటిలో విద్యార్థుల ప్రాణాపాయం తప్పింది.
సిద్దిపేటలోని కాకతీయ టెక్నో హై స్కూల్లో షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో ఏసీ వద్ద ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పాఠశాలలోని ఫ్రిజ్, సామాగ్రి, విద్యార్థుల బుక్స్, బ్యాగ్లు పూర్తిగా కాలిపోయాయి. స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపు చేశారు. పాఠశాలలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలితే పెను ప్రమాదం జరిగి ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాల నిర్వాహకులు సరైన నిబంధనలు పాటించడంలేదని ఆరోపించారు.