Farmer touches MRO feet : 'మేడమ్ మీ కాళ్లు మొక్కుతా.. జర మా వడ్లు కొనుండ్రి'
Farmers touches MRO feet in Husnabad: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. అకాల వర్షాలతో కర్షకులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఆరుగాలం పండించిన పంటంతా నేలరాలి.. నీటిలో కొట్టుకుపోయి తీవ్ర నష్టాల పాలయ్యారు. అరకొర మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల దగ్గరకు తీసుకువస్తే కొనుగోళ్లలో జాప్యం వల్ల అది కూడా వర్షాలకు తడిసి ముద్దవుతోంది. ఈ క్రమంలో రైతులు అధికారులు, ప్రభుత్వాలను మిగిలిన ధాన్యమైనా త్వరగా కొనేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలా ఓ అన్నదాత ధాన్యం కొనుగోళ్ల కోసం తాము పడుతున్న అరిగోసను చెప్పుకుంటూ ఎంఆర్ఓ కాళ్ల మీద పడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది. ధాన్యం, మొక్కజొన్న పంటలను కొనుగోళ్లు చేయాలని ఓ రైతు అక్కడికి వచ్చిన తహసీల్దార్ కాళ్లు మొక్కాడు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ తన గోడును అధికారులకు వెల్లబోసుకున్నాడు. ధాన్యం తీసుకొచ్చి 20 రోజులైనా తేమ పేరుతో కొనుగోళ్లలో జాప్యం చేస్తూ తమని నానా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. సమ్మయ్య అనే రైతు తహసీల్దార్ గీయాస్ ఉన్నీసా బేగం కాళ్లు మొక్కిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.