తెలంగాణ

telangana

పిడిగుద్దులు, పరోటా గరిటెతో టీ షాప్​ యజమానిపై దాడి.. పోలీస్​ స్టేషన్​ పక్కనే..

ETV Bharat / videos

డబ్బులు అడిగాడని టీ షాప్​ ఓనర్​ను చితకబాదిన యువకులు.. పోలీస్​స్టేషన్​ పక్కనే!

By

Published : Jul 10, 2023, 5:49 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. టీ, పరోటాలు అమ్ముకుంటూ జీవనం సాగించే వ్యక్తిపై దాడికి దిగారు. దుకాణంలో అరువుగా తీసుకున్న టీ, పరోటాల డబ్బులు తిరిగి ఇవ్వాలని.. అప్పుడే కొత్తగా మళ్లీ అరువు ఇస్తానని యజమాని చెప్పడం వల్ల అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో దుకాణదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు.

ఝాన్సీ జిల్లాకు చెందిన బ్రజేంద్ర సాహు కుమారుడు సురేశ్​ సాహు ఝాన్సీ పోలీస్​ స్టేషన్​ సమీపంలో టీ, పరోటాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం (జులై 8) అర్ధరాత్రి 12:30 నిమిషాల ప్రాంతంలో నలుగురు యువకులు వచ్చి సురేశ్​ను టీ, పరోటాలను అరువుగా ఇవ్వాల్సిందిగా కోరడమే కాకుండా కొంత డబ్బును కూడా డిమాండ్​ చేశారు. అప్పుడు అతడు ముందు పాత బాకీ తీర్చండి.. అప్పుడే కొత్తగా అరువు ఇస్తానని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆ నలుగురు పోకిరీలు ఒక్కసారిగా టీ షాప్​ యజమానిపై దాడికి దిగారు. మూకుమ్మడిగా అతడిని చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్దారు. నలుగురిలో ఇద్దరు అక్కడే ఉన్న ప్లాస్టిక్​ కుర్చీతో, పరోటాలు కాల్చే గరిటతో సురేశ్​ తలపై బలంగా కొట్టి గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఈ దాడి ఘటనలో సురేశ్​ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలన్నీ దుకాణంలో ఉన్న సీసీటీవీలో రికార్డ్​ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటన పోలీస్​ స్టేషన్​ పక్కనే జరగడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details