Thammineni on Karnataka Results : 'మతోన్మాదాన్ని ప్రచారం చేసిన మోదీకి కన్నడ ప్రజలు సరైన తీర్పిచ్చారు' - సీపీఎం నాయకుల ధర్నా
Thammineni on Karnataka Results : అధికారంలో ఉండి.. ప్రజలకు చేసింది చెప్పుకోలేక మతోన్మాదాన్ని ప్రచారం చేసిన మోదీకి వ్యతిరేకంగా కన్నడ ప్రజలు తీర్పు ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దిల్లీలో న్యాయం కోసం ఆందోళన చేస్తున్న రెజ్లర్ల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఖమ్మంలో సీపీఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. దిల్లీలో తమపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తుంటే.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకు నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ క్రమంలోనే కన్నడ ప్రజలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న ఆయన.. రాష్ట్రంలో న్యాయమైన డిమాండ్‌తో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనటం దుర్మార్గమైన ప్రకటనగా పేర్కొన్నారు. వారు ఉద్యోగంలో చేరి 4 సంవత్సరాలు అయినా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయకపోవడంపై మండిపడ్డారు. వారితో కనీసం చర్చలకు అయినా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. వెంటనే జేపీఎస్‌లను చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలన్నారు.