బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మహిళా కార్యకర్తల ధర్నా..
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దేశ రాజకీయాలలో వేడి పుట్టించిన సంఘటన ఇది. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అని భాజపా వారిని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర భాజపా కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్, మహిళ నాయకులు ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన వారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో యూత్ కాంగ్రెస్, మహిళా నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ అధినేత రాహుల్ గాంధీపై కక్షపూరితంగా అనర్హత వేటు వేయడం దుర్మార్గమని.. ఆదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే రాహుల్పై వేటు వేశారని మండిపడ్డారు.