Himanshu Kalvakuntla : సోషల్ మీడియాలో కేటీఆర్ తనయుడు హిమాన్షు సాంగ్ వైరల్ - మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు పాడిన పాట
Himanshu Kalvakuntla Golden Hour Cover Song viral : ప్రస్తుతం అన్ని రంగాల్లోను యువకులు తమ ప్రతిభను ఏదో ఒక రకంగా చూపుతున్నారు. వారిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలను మరింత సాధన చేసి వారిని వారే అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తిలోనూ ఎంతో కొంత నైపుణ్యం ఉంటుంది. దాన్ని గుర్తించి పెంచుకునేటట్టు చేసే వాళ్లు తక్కువ మంది ఉంటారు. ప్రస్తుత రోజుల్లో అవకాశాలు లభించడమే గగనం అయిపోయింది. కానీ వారిలో ప్రతిభ ఉంటే ఏదో ఒక రకంగా అవకాశం వారిని వెతుక్కుంటూ వస్తుంది.
ప్రతి ఒక్కరూ తమకంటూ సొంత గుర్తింపును కోరుకుంటారు. గొప్ప కుటుంబంలో జన్మంచిన వారు కూడా వారసులుగా వారి ముందు జనరేషన్ నీడలో ఉండటం కంటే సొంతగా ఎదగాలని కోరుకుంటారు. అదే విధంగా తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు అయిన హిమాన్షు కల్వకుంట్ల కూడా ఇదే పంథాలో నడుస్తున్నారు. తాత, తండ్రి బాటలో రాజకీయాల్లోకి నడవకుండా తన రూట్ మార్చారు. మ్యూజిక్ తన ఇంట్రెస్ట్ అని ప్రపంచానికి చూపించారు. అందులో భాగంగానే ఓ పాట పాడారు. హిమాన్షు పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోల్డెన్ అవర్ అనే ఇంగ్లీష్ కవర్ సాంగ్‌ను పాడారు హిమాన్షు. ఈ వీడియోను ట్విటర్, యూట్యూబ్ ఖాతాల్లో షేర్ చేశారు.
ఈ వీడియోను మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. తన కుమారుడి పాట చాలా నచ్చిందని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. హిమాన్షును చూస్తుంటే తండ్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ పాటను మెచ్చుకుంటూ ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు.