CM KCR on Metro Expansion : 'బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో తెచ్చేందుకు కృషి' - బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో
CM KCR Annonuced Metro Extension to Maheshwaram : తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ముందుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులోని హరితోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ మొక్క నాటారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్... మహేశ్వరం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. మెట్రో రైలును మహేశ్వరం వరకు విస్తరించేందుకు కృషి చేయనున్నట్లు సభలో సీఎం హామీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనపై స్పందించిన కేసీఆర్... శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తున్న మెట్రోను మహేశ్వరం వరకు తీసుకురావచ్చన్నారు. అటు ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్ వరకు ఉన్న మైట్రోరైలును.. బీహెచ్ఈఎల్ వరకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు.
అలాగే మహేశ్వరానికి వైద్య కళాశాల, సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తుమ్మలూరులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేసిన కేసీఆర్... జల్‌పల్లి, తుక్కుగూడకు 25 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున, 65 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సీఎం ప్రకటనతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ,ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.