Car Theft in Hyd : సాయం చేస్తానని చెప్పి.. కారుతో ఉడాయించాడు - Car Theft at gandhinagar
Car Theft in Hyderabad : ఆగిపోయిన కారు నడిచేందుకు సాయం చేస్తానని చెప్పిన వ్యక్తి ఆ కారుతోనే ఉడాయించిన ఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. షాద్‌నగర్‌కు చెందిన నవీన్ కారులో ఓ హోటల్ నుంచి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో కారు టీ జంక్షన్ వద్ద ఆగిపోయింది. కారు ఎయిర్‌లాక్ కావడంతో ఒంటరిగా కాసేపటి వరకు ముందుకు తోసుకుంటూ వెళ్లాడు నవీన్.
అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న వ్యక్తి ఏమైందని అడిగాడు. విషయం తెలిశాక.. తాను మెకానిక్‌నని.. కారు స్టార్ట్ అయ్యేందుకు సాయం చేస్తానని చెప్పాడు. కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని నవీన్‌ను వెనుక వైపు నుంచి నెట్టమని చెప్పాడు. అతడు నిజంగానే మెకానిక్ అని నమ్మిన నవీన్ కాసేపు కారును నెట్టాడు. ఇంతలోనే కారు స్టార్ట్ అయ్యింది. ఇంకేం.. ఆ వ్యక్తి నవీన్‌కు మస్కా కొట్టి కారుతో సహా ఉడాయించాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు.. అతడు చాలా దూరం వెళ్లిపోయాడు. ఈ ఘటన నుంచి తేరుకున్న నవీన్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.